Sunil Gavaskar: కోహ్లీ విషయంలో టీమిండియా సెలెక్టర్లను ఏకిపారేసిన గవాస్కర్

  • సమావేశం నిర్వహించకుండా కెప్టెన్ ను ఎలా ఎంపికచేస్తారంటూ ప్రశ్నించిన సన్నీ
  • వరల్డ్ కప్ వైఫల్యానికి కోహ్లీని బాధ్యుడ్ని చేయరా? అంటూ వ్యాఖ్యలు
  • విండీస్ టూర్ కు కెప్టెన్ ఎంపిక ఎవరి నిర్ణయం మేరకు జరిగిందంటూ నిలదీసిన వైనం

భారత క్రికెట్ సెలెక్టర్లపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెస్టిండీస్ టూర్ కు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరు ప్రకటించడం పట్ల గవాస్కర్ విమర్శలు చేశాడు. "వరల్డ్ కప్ వరకే టీమిండియాకు కోహ్లీ కెప్టెన్. కానీ, సెలెక్టర్లు ఎలాంటి సమావేశం జరపకుండా కోహ్లీని వెస్టిండీస్ టూర్ కు కెప్టెన్ గా ఎలా ప్రకటిస్తారు?" అంటూ మండిపడ్డాడు. కెప్టెన్ ను ఎంపిక చేయడానికి సెలెక్టర్లు సమావేశం కావడం ఎంతో అవసరం అని పేర్కొన్నాడు.

"వరల్డ్ కప్ తర్వాత కోహ్లీకి విశ్రాంతినిస్తామని సెలెక్టర్లు చెప్పారు. ఉన్నట్టుండి వెస్టిండీస్ టూర్ కు మూడు ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ అంటూ ప్రకటించారు. సెలెక్టర్ల నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా? లేక కోహ్లీ నిర్ణయం మేరకు కెప్టెన్ ఎంపిక జరిగిందా? అసలు ఇది బీసీసీఐ సెలెక్షన్ కమిటీయేనా? కోహ్లీని విండీస్ టూర్ కు కెప్టెన్ అని ప్రకటించడం ద్వారా సెలెక్టర్లపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ అనంతరం కొంతమంది ఆటగాళ్లపై వేటు వేశారని, కానీ జట్టును ఫైనల్ చేర్చడంలో విఫలమైన కోహ్లీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశాడు.

More Telugu News