Andhra Pradesh: ‘చంద్రన్న కానుక’లో ఇచ్చిన సంచి దానికి మాత్రమే ఉపయోగపడింది!: వైసీపీ ఎమ్మెల్యే కాకాణి ఎద్దేవా

  • చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని మోసం చేశారు
  • ప్రజాతీర్పుపై ఇంకా పశ్చాత్తాప పడటం లేదు
  • అసెంబ్లీలో మాట్లాడిన వైసీపీ నేత

టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే ఉపయోగపడిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ విమర్శించారు.  ప్రజలు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు పశ్చాత్తాప పడకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల ప్రజాసొమ్మును చంద్రబాబు, ఆయన తాబేదారులు దోచుకున్నారని విమర్శించారు.

నీరు చెట్టు, రాజధాని భూములు, పసుపు-కుంకుమ, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్‌ తోఫా, చంద్రన్న క్రిస్మస్‌ కానుక వంటి పథకాలతో భారీ దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. చంద్రన్న కానుకలో భాగంగా ఇచ్చిన సంచి రేషన్, పెన్షన్ కోసం కాగితాలు పెట్టుకుని తిరగడానికి మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాకాణి మాట్లాడారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నివర్గాలకు లబ్ధి చేకూర్చేలా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారని కాకాణి తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్న ఘనత వైఎస్ జగన్ దేనని స్పష్టం చేశారు. కౌలు రైతులను ఆదుకునేందుకు చట్టం, వడ్డీలేని రుణాలు, వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు, ప్రకృతి విపత్తుల నిధి, ధరల స్థిరీకరణ నిధి, 9 గంటల విద్యుత్‌ పగటి పూటే రైతులకు అందించాలనే నిర్ణయం, ఆక్వా రైతులకు రూ.1.50 పైసలకే యూనిట్‌ విద్యుత్‌ వంటి సంచలనాత్మక నిర్ణయాలను జగన్ తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ 2014లో సీఎం అయ్యాక చంద్రబాబు పెట్టిన సంతకాలకు ఇప్పటికీ దిక్కులేకుండా పోయిందని విమర్శించారు.

More Telugu News