Hyderabad: కేటుగాడు...అమ్మాయి పేరుతో అబ్బాయికి వల

  • ఫిషింగ్‌ లింక్‌తో అతని ఖాతాలోకి ప్రవేశం
  • వివరాలు సేకరించి బ్లాక్‌ మెయిలింగ్‌
  • బాధితుడి ఫిర్యాదుతో కటకటాలపాలు

వయసు చిన్నదే అయినా వక్ర బుద్ధిలో పెద్దోడు ఈ ప్రబుద్ధుడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో అకౌంట్‌ తెరిచి ఓ అబ్బాయికి వల విసిరాడు. అనంతరం అతడినే బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో కటకటాలపాయ్యాడు.

సైబర్‌ క్రైం పోలీసుల కథనం మేరకు...మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన మహ్మద్‌ మునీర్‌ అహ్మద్‌ బీటెక్‌ పూర్తి చేశాక ఎథికల్‌ హ్యాకింగ్‌ శిక్షణ కేంద్రంలో మెలకువలు ఔపోసన పట్టాడు. అనంతరం 'మెలిన్‌ సోపియా' అనే యువతి పేరుతో ఖాతా తెరిచాడు. ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ రావడంతో ఆమోదించాడు. కొన్నాళ్లపాటు చాటింగ్‌తో ఇద్దరి మధ్య చనువు పెరిగింది.

అనంతరం 'జడ్‌ షాడో' అప్లికేషన్‌ ద్వారా ఫిషింగ్‌ లింక్‌ రూపొందించి అతడికి పంపాడు. అది ఫిషింగ్‌ లింక్‌ అని తెలియక అతను క్లిక్‌ చేశాడు. అంతే, అతని ఫేస్‌బుక్‌ ఖాతాలోకి మునీర్ ప్రవేశించి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ మార్చేశాడు. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని బెదిరించడం మొదలుపెట్టాడు.

రోజురోజుకీ ఇతని బెదిరింపులు పెరగడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మునీర్‌ నిర్వాకాన్ని గుర్తించిన పోలీసులు ఇతను ఇంకా ఎవరెవరి ఖాతాలను దొంగిలించాడన్న అంశంపై ఆరాతీస్తున్నారు.

More Telugu News