India: భారత్ లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఇక్కడితో ఆగబోం!: ప్రధాని మోదీ

  • తొమ్మిదేళ్ల క్రితం రెట్టింపు చేయాలనుకున్నాం
  • నాలుగేళ్లు మిగిలిఉండగానే పులుల్ని రెట్టింపు చేశాం
  • టైగర్ ఎస్టిమేషన్-2018ను విడుదల చేసిన మోదీ

భారత్ లో పులుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే పులులకు భారత్ అత్యంత సురక్షితమైన ఆవాసంగా మారిందని వ్యాఖ్యానించారు. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘ఆల్ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2018’ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ..2014లో దేశవ్యాప్తంగా 2,266 పులులు ఉండేవని చెప్పారు. కానీ 2018 నాటికి ఈ సంఖ్య 2,967కు పెరిగిందన్నారు.

2022 నాటికి దేశంలో పులుల సంతతిని రెట్టింపు చేయాలని 9 సంవత్సరాల క్రితం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇంకా నాలుగేళ్లు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పులుల సంరక్షణా కేంద్రాల సంఖ్య 692 నుంచి 860కి పెరిగిందన్నారు. కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలు 43 నుంచి 100ను దాటాయన్నారు. ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భారత్ రూపుదిద్దుకుందని అన్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలను  ప్రస్తావిస్తూ.. దేశంలో పులుల సంతతి ఏక్ థా టైగర్(ఒకే పులి) అనే పరిస్థితి నుంచి టైగర్ జిందా హై అనే స్థాయికి చేరిందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇది ఇక్కడితో ఆగిపోదనీ, ఇంకా ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ పేరుతో ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తోంది.

More Telugu News