Modi: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, నెతన్యాహుల బ్యానర్లు

  • సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ పార్లమెంటుకు ఎన్నికలు
  • నెతన్యాహు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వెలసిన మోదీ బ్యానర్లు
  • మోదీ, నెతన్యాహుల మధ్య గాఢ అనుబంధం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ అగ్ర నేతల్లో ఒకరిగా ఎదిగారన్నదానికి ఇదొక ఉదాహరణ. ఇజ్రాయెల్ లో జరగనున్న ఎన్నికల్లో మోదీ బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ నెతన్యాహు, మోదీలు కలసి ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేసింది. దేశ రాజధాని టెల్ అవీవ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఈ బ్యానర్ ను ప్రదర్శిస్తున్నారు. దీంతో, పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లతో కలసి ఉన్న బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రపచంలోని అగ్ర నేతలతో నెతన్యాహుకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇజ్రాయెల్ రాజకీయవేత్తలలో నెతన్యాహుకు ఉన్నంత గొప్ప సంబంధాలు మరెవరికీ లేవని చెప్పే ఉద్దేశంతో ఈ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, మోదీతో నెతన్యాహుకు వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. మోదీ రెండో సారి ప్రధాని అయిన తర్వాత... ఆయనకు అందరి కంటే ముందుగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేత నెతన్యాహునే. ఇజ్రాయల్ చరిత్రలోనే నెతన్యాహుకు గొప్ప రాజకీయవేత్తగా పేరుంది. దేశ ప్రధానిగా సుదీర్ఘ కాలం నుంచి ఆయన సేవలందిస్తున్నారు.

ఇజ్రాయెలీ పార్లమెంటును మే నెలలో రద్దు చేశారు. దీంతో, ఈ ఏడాది ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్ తర్వాత ఏర్పాటైన (నెతన్యాహు నేతృత్వంలో) సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 17న రీ-ఎలెక్షన్ జరగబోతోంది.

More Telugu News