Hero shivaji: నాపై అసత్య కథనాలు ప్రసారం చేశారు: హీరో శివాజీ

  • టీవీ 9’ తమ యాజమాన్యాన్ని సంతోషపెట్టేందుకే అసత్య కథనాల ప్రసారం 
  • నన్ను పోలీసులతో చంపిస్తే అప్పుడు వారి పగ తీరుతుందేమో!
  • నేను అమెరికా వెళ్లిన ప్రతిసారీ లీగల్ గానే వెళ్లాను

అలందా మీడియా కేసులో సినీ నటుడు శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా వెళ్లేందుకు యత్నించిన శివాజీని పోలీసులు అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లేందుకు యత్నించారని, ఆయన్ని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో శివాజీ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వార్తలు అబద్ధమని కొట్టిపారేశారు. తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారని ‘టీవీ9’పై మండిపడ్డారు. తెలంగాణ పోలీసులకు చేతగాక, దుబాయ్ పోలీసులు తనను పట్టుకున్నారని ‘టీవీ9’ చెప్పాలనుకుంటోందా? అని ప్రశ్నించారు. ‘మై హోం’ రామేశ్వరరావును, మెగా కృష్ణారెడ్డిని లేదంటే, వారికి సంబంధించిన నాయకులను ఏదో విధంగా సంతోష పెట్టాలని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు.

‘టీవీ 9’ తమ యజమానులను సంతోషపెట్టేందుకు అసత్య కథనాలు ప్రసారం చేస్తోందని. తనను పోలీసులతో చంపేస్తే అప్పుడు వారి పగ తీరుతుందేమో అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ అమెరికాకు యాభై సార్లు వెళ్లానని, ప్రతిసారి లీగల్ గానే వెళ్లానని అన్నారు. తన బిడ్డ కాలేజీ పనుల నిమిత్తం అమెరికా వెళదామనుకుంటే అడ్డుపడ్డారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీ సజ్జనార్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఇంత జరుగుతున్నా ఆయన ఎందుకు ప్రశ్నించరు? ఇది లీగల్ కాదని ఆయన ఎందుకు అడగరు? ‘నేనేమి తప్పు చేశాను. ఒక చిన్న తప్పు చెప్పండి?’ అని ప్రశ్నించారు.

తాను ప్రజల కోసం పోరాడానని, ఏ పార్టీ తప్పు చేసినా ఆ పార్టీని ప్రశ్నించానని అన్నారు. తనకు చంద్రబాబునాయుడు కోట్ల రూపాయలు ఇచ్చారంటూ గతంలో పలు రకాల దుష్ప్రచారాలు తనపై చేశారని మండిపడ్డారు. డబ్బులు సంపాదించుకోవాలన్న మెంటాలిటీ ఉంటే, బీజేపీలో నుంచి బయటకు ఎందుకొస్తానని ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వారికి ఇలాంటి కష్టాలు వస్తాయని తనకు తెలుసని అన్నారు. కచ్చితంగా పారిపోవాల్సిన పరిస్థితి ఉందని, అయితే, కోర్టులపై నమ్మకం ఉంది అని, తనకు న్యాయం చేసిందని అన్నారు.  

More Telugu News