Kadapa District: బాలుడిని కిలోమీటర్ దూరం భుజాలపై మోసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ!

  • కడప జిల్లా పాలకొండల వద్ద ఘటన
  • వాటర్ ఫాల్స్ వద్దకు వెళితే వెంటబడిన తేనెటీగలు
  • బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు

తేనెటీగలు కుడుతుంటే, ఓ లోయలో పడిపోయి, కాలు విరిగి, మూడు గంటల పాటు నరకయాతన అనుభవించిన పదో తరగతి బాలుడిని, విషయం తెలుసుకున్న ఎస్ఐ, కిలోమీటర్ దూరం పాటు భుజాలపై మోసుకుంటూ, అడవి నుంచి బయటకు తెచ్చారు. ఈ ఘటన నిన్న కడప జిల్లాలోని పాలకొండల వాటర్ ఫాల్స్ వద్ద జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇందిరానగర్ కు చెందిన ఆదిజాల మణికంఠ అనే విద్యార్థి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ ఓ తేనెతుట్టె కనిపించడంతో ఒకరు దానిపైకి రాయి విసరడంతో అవి ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేశాయి.

మిగతా ముగ్గురూ ఎలాగోలా తప్పించుకోగా, మణికంఠ మాత్రం చిక్కుకున్నాడు. అవి కుడుతుంటే, పరిగెత్తుతూ లోయలోకి పడిపోయాడు. అయినా వదలకుండా తేనెటీగలు కుడుతూనే ఉన్నాయి. మిగతా ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి స్థానికులకు విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ విద్యాసాగర్, తన సిబ్బందితో అక్కడికి వచ్చి, బాలుడిని రక్షించారు. విద్యాసాగర్ దాదాపు కిలోమీటర్ కు పైగా దూరాన్ని మణికంఠను భుజాలపై మోస్తూ తెచ్చి, ఆపై అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకూ గాయాలు అయ్యాయి.

More Telugu News