actor sivaji: నన్ను దుబాయ్‌లో పోలీసులు అడ్డుకున్నారా? ఇలాంటి రాతలకంటే నన్ను చంపించడం బెటర్ కదా: నటుడు శివాజీ ఫైర్

  • నేను హైదరాబాద్‌లో ఉంటే దుబాయ్‌లో పోలీసులు అడ్డుకున్నారా?
  • నేనేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదినా?
  • నన్ను చంపేస్తే మైహోం రామేశ్వరరావు ఆనందంగా ఉంటారు

దుబాయ్ పోలీసులు తనను అడ్డుకుని వెనక్కి వెళ్లిపొమ్మన్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై నటుడు శివాజీ స్పందించారు. పోలీసులు తనను అడ్డుకోవడానికి తానేమీ అంతర్జాతీయ ఉగ్రవాదిని కాదన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం కంటే తనను పోలీసులతో చంపించేయాలని, అప్పుడే మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావులు ఆనందంగా ఉంటారని అన్నారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నా అమెరికా పారిపోతుంటే దుబాయ్‌లో పోలీసులు అడ్డుకున్నారని టీవీ9లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు వస్తుంటే పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తనపై ఉన్నది చాలా చిన్న కేసని పేర్కొన్న శివాజీ.. తనను విచారించవద్దని స్వయంగా కోర్టు కూడా చెప్పిందన్నారు. రాజకీయ ప్రతీకారం కోసం ఇలాంటి చిన్న కేసులకు కూడా లుక్ అవుట్ నోటీసులివ్వడం దారుణమన్నారు. తెలంగాణ పోలీసులు చేతకాని వాళ్లు కావడంతో దుబాయ్ పోలీసులు తనను పట్టుకున్నట్టు టీవీ9 కథనం ఉందన్నారు. మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం తనకు కల్పించిన సెక్యూరిటీని తొలగించారని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరినట్టు చెప్పారు. తనపై లుక్ అవుట్ నోటీసు ఎందుకు జారీ చేశారో అర్థం కావడం లేదని, తాను, రవిప్రకాశ్ షేర్లు కొనుక్కుంటే రామేశ్వరరావుకు వచ్చిన అభ్యంతరం ఏమిటో తనకు తెలియడం లేదన్నారు. సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన కుక్క సింహం కాబోదని శివాజీ ఘాటుగా విమర్శించారు.

More Telugu News