Komatireddy: వారం క్రితం కూడా బాగానే ఉన్న జైపాల్ రెడ్డి... ప్రాణం తీసిన జ్వరం, జలుబు!

  • జ్వరంతో ఆసుపత్రిలో చేరిన నేత
  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • స్మారకానికి స్థలం ఇవ్వాలన్న కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మరణం, కాంగ్రెస్ వర్గాలకు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తీరని లోటే. వారం రోజుల క్రితం కూడా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన, ఇప్పుడు లేరంటే నమ్మశక్యం కావడం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం జ్వరం, జలుబుతో ఆయన మరణించారంటే నమ్మలేకనున్నానని కోమటిరెడ్డి అన్నారు.

నాలుగు రోజుల క్రితం ఆయన్ను గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేర్చగా, నయమవుతుందని వైద్యలు చెప్పారని, అందువల్లే ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారాన్ని బయటకు తెలియనివ్వలేదని ఆయన అన్నారు. పరిస్థితి విషమించి అర్ధరాత్రి 1.28 గంటలకు ఆయన మరణించారని అన్నారు. తాను చిన్నప్పుడు ఆయన ఇంటిలోనే పెరిగానని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన అంత్యక్రియలకు నక్లెస్ రోడ్ లో స్థలాన్ని కేటాయించాలని, ఓ స్మారక స్థూపాన్ని ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు.

జైపాల్ రెడ్డి తనకు చాలా దగ్గరి బంధువని, రాజకీయ ఓనమాలు నేర్పిన నేతని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీగా ఆయన ఉన్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనకెన్నో సలహాలు, సూచనలు ఇస్తూ నడిపించారని అన్నారు.

More Telugu News