Shoiab Akhtar: టెస్టులకు రిటైర్మెంటు ప్రకటించిన ఆటగాడికి చీవాట్లు పెట్టిన షోయబ్ అక్తర్

  • టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ఫాస్ట్ బౌలర్ అమీర్ ప్రకటన
  • వన్డేల్లో, టి20ల్లో ఆడతానంటూ వెల్లడి
  • ఇలాంటి క్రికెటర్ ను ఏ ఫార్మాట్ లోనూ ఎంపిక చేయనంటూ అక్తర్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ లో ఎంతో ప్రతిభావంతుడిగా గుర్తింపు ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశాడు. అమీర్ వయసు 27 ఏళ్లే కావడంతో అప్పుడే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడంతో మాజీ క్రికెటర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే అమీర్ పై నిప్పులు చెరిగాడు. తానే పాక్ సెలెక్టర్ నైతే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుని, పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానంటున్న ఇలాంటి ఆటగాళ్లను ఏ ఫార్మాట్ లోనూ ఎంపిక చేయనని అన్నాడు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్ నుంచి వైదొలగడం ఏమైనా సబబుగా ఉందా? అని నిలదీశాడు. అమీర్ మరెన్నో సంవత్సరాలు క్రికెట్ ఆడగలడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

"పాకిస్థాన్ క్రికెట్ మిణుకుమిణుకుమంటున్న దశలో తప్పుకుంటావా? దేశానికి నువ్విచ్చేది ఇదేనా? నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు పాక్ నీకోసం ఎంతో ఖర్చుపెట్టింది. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తేనే ఈ స్థాయిలో ఉన్నావు. నువ్వు ఆలోచించినట్టే ఇతర క్రికెటర్లు కూడా ఆలోచిస్తే పరిస్థితి ఎలా తయారవుతుంది? నీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్ లోనూ ఆడకుండా చేయాలి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లో పాకిస్థాన్ జట్టు సిరీస్ విజయాలు సాధించిన సమయంలో నేను గాయంతో బాధపడుతూనే ఆడాను" అని తెలిపాడు. పాక్ క్రికెట్ లో ఏం జరుగుతోందో పీసీబీ దృష్టిపెట్టాలని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకుని పాక్ క్రికెట్ ను గట్టెక్కించాలని అక్తర్ కోరాడు.

More Telugu News