USA: అమెరికా టెక్ కంపెనీలపై ఫ్రాన్స్ పన్ను.. ట్రంప్ ఆగ్రహం.. ఫ్రాన్స్ వైన్ పై పన్ను విధిస్తామని హెచ్చరిక!

  • డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించిన ఫ్రాన్స్
  • ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పై ట్రంప్ మండిపాటు
  • ఆయన మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • అమెరికా వైన్ ఫ్రాన్స్ వైన్ కంటే రుచిగా ఉంటుందని వ్యాఖ్య

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికాకు చెందిన గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ సంస్థలపై ఫ్రాన్స్ ప్రభుత్వం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఫ్రాన్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తాను ప్రతీకార చర్యలకు దిగాల్సి ఉంటుందనీ, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే వైన్ పై పన్నులు వేస్తామని హెచ్చరించారు.

డిజిటల్ పన్నుల విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మూర్ఖంగా వ్యవహరించారనీ, తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. అసలు ఫ్రాన్స్ వైన్ కంటే అమెరికా వైన్ మరింత రుచిగా ఉంటుందని ట్రంప్ సెలవిచ్చారు. వైన్ ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, వీటిలో ఎక్కువ భాగం ఫ్రాన్స్ నుంచే దిగుమతి అవుతోంది.

ఫ్రాన్స్ పార్లమెంటు ఇటీవల డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ చట్టాన్ని ఆమోదించింది. దీనిప్రకారం ఏటా రూ.5,853 కోట్ల(850 మిలియన్ డాలర్లు) ఆదాయం అర్జించే కంపెనీలు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనిప్రకారం ఫ్రాన్స్ లో అర్జించే ఆదాయంపై టెక్నాలజీ సంస్థలు 3 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా 2019లో ఫ్రాన్స్ కు 3,070 కోట్లు ఆదాయం రావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

More Telugu News