Andhra Pradesh: మరింత ముదిరిన ‘పొనుగోడు’ వివాదం.. టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • గుంటూరు జిల్లా పొనుగోడు గ్రామం వద్ద ఘటన
  • ఊరి బయటే టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • అరెస్ట్ చేసి శివ అతిథిగృహానికి తరలింపు

పొనుగోడులో టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా వైసీపీ నేతలు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఈరోజు గుంటూరు జిల్లాలోని పొనుగోడుకు చేరుకోగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఊర్లోకి వెళితే శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతాయనీ, కాబట్టి తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో టీడీపీ నేతలు మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

దీంతో అసహనం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊర్లోకి వెళ్లి తీరుతామని ప్రకటించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన  డొక్కా మాణిక్య వరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్,  అశోక్ బాబు, శమంతకమణిలను అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని నరసరావుపేటలోని శివ అతిథిగృహానికి తరలించారు. కాగా, పోలీసులు, వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. శాంతిభద్రతలను సాకుగా చూపి తమను అడ్డుకోవడం దారుణమన్నారు.

More Telugu News