Andhra Pradesh: వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పునఃప్రతిష్ట.. విజయవాడలో స్థలాల్ని పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు!

  • విజయవాడలో వైఎస్ విగ్రహం తొలగింపు
  • ట్రాఫిక్ ఇబ్బందుల్ని సాకుగా చూపిన టీడీపీ ప్రభుత్వం
  • పాత విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించనున్న వైసీపీ సర్కారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద తొలగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున:ప్రతిష్టించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. వైఎస్ విగ్రహాన్ని పాతచోటే మళ్లీ ప్రతిష్టించాలన్న అభిమానులు, వైసీపీ కార్యకర్తల డిమాండ్ కు తలొగ్గిన నేతలు ఇందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అందులో భాగంగా మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్టు, జోగి ర‌మేష్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌ తదితరులు ఈరోజు బందరు రోడ్డులోని పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతంలోనే ప్రతిష్టించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ స్థల పరిశీలన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ కార్యాలయంలో భేటీ అయ్యారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇక్కడ వైఎస్ విగ్రహాన్ని తొలుత ప్రతిష్టించారు. అయితే కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్ కు అడ్డంగా ఉందని విగ్రహాన్ని తొలగించారు. ఈ విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ వద్ద భద్రపరిచారు. దాన్నే ఇప్పుడు మరోసారి ప్రతిష్టించబోతున్నారు.

More Telugu News