Karnataka: కుమార కథ ముగిసింది...ఇక స్పీకర్‌ వంతు : కర్ణాటకలో బీజేపీ వ్యూహం

  • రమేష్‌కుమార్‌ను గద్దె దింపేందుకు పావులు
  • ఆర్టికల్‌ 179(సీ) ప్రయోగించనున్న కమలనాథులు
  • నిర్ణయాలేవీ తీసుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యం

కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి కథ ముగిసింది. దీంతో ప్రస్తుతం కమలనాథులు స్పీకర్‌ రమేష్‌కుమార్‌పై దృష్టిసారించారు. ఇప్పుడేకాదు, భవిష్యత్తులో కూడా స్పీకర్‌తో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న కాషాయదళం ఆయనపై ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగించి తొలుత కట్టడి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సభలో విశ్వాసం పొందాక ఏకంగా సాగనంపే ఉద్దేశంతో ఉంది.

వివరాల్లోకి వెళితే... కాంగ్రెస్ అండతో గత ఏడాది మే 23న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామి ఈ 14 నెలల కాలం ‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’గా నెట్టుకుంటూ వచ్చారు. చివరికి అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో విశ్వాసపరీక్షలో ఓటమిపాలై అధికారం కోల్పోయారు.

దాదాపు ఏడాది రెండు నెల నుంచి అధికారం కోసం ఎదురు చూస్తున్న కాషాయదళం కోరిక నెరవేరింది. కానీ సభలో బలనిరూపణ చేసుకోవాల్సిన పెద్ద గండం ముందుంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ వ్యవహారశైలి చాలా కీలకం. ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. మిగిలిన వారి రాజీనామాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఇదే జరిగితే బీజేపీ గట్టెక్కడం కష్టమే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ అనుకూలవాదిగా ముద్రపడిన స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను సాగనంపకుంటే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే సిసలైన వ్యూహానికి తెరతీస్తున్నట్లు సమాచారం.

సోమవారం సీఎం యడ్యూరప్ప తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. రెబెల్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై ఈలోగానే స్పీకర్‌ వేటు వేస్తే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం యడ్యూరప్పకు కష్టమవుతుంది. అందుకే ఆయనను వీలైనంత వేగంగా సాగనంపే ఏర్పాట్లను కమలనాథులు చేస్తున్నారు. సభలో మెజార్టీ ఉన్న పార్టీకి స్పీకర్‌ను తొలగించే అధికారం ఉన్నప్పటికీ బలనిరూపణ చేసుకోక ముందే ఇది సాధ్యం కాదు.

 ఈలోగా ఆయనను కట్టడి చేయాలంటే ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగం ఉత్తమమని కమలనాథులు భావిస్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్  ఇది. దీని ప్రకారం ఆయనను తొలగిస్తూ నోటీసు ఇస్తే, ఇప్పటికిప్పుడు స్పీకర్‌ను తొలగించలేకున్నా ఆయన అధికారాలకు మాత్రం బ్రేక్‌ పడుతుంది. 14 రోజుల నోటీసు పీరియడ్‌లో స్పీకర్‌కు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. ముఖ్యంగా రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ దిశగా అధికార బీజేపీ పావులు కదుపుతోంది.

More Telugu News