Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.. కేసులు తిరగదోడేందుకు సిద్ధమైన ఎన్ఐఏ!

  • అక్బరుద్దీన్ ‘15’ నిమిషాల వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ దృష్టి
  • కేసు వివరాలను సేకరించిన ఎన్ఐఏ
  • 29న రాష్ట్రవ్యాప్తంగా అక్బరుద్దీన్ దిష్టిబొమ్మల దహనం

15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే దేశంలోని హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామంటూ 2013లో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం మరోమారు దృష్టి సారించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నమోదైన అన్ని కేసులను తిరగదోడి కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్బరుద్దీన్‌ నాటి వ్యాఖ్యలపై కేంద్రం తాజాగా దృష్టిసారించడానికి కారణం రెండు రోజుల క్రితం కరీంనగర్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది.

ఇటీవల కరీంనగర్‌లో మాట్లాడిన అక్బరుద్దీన్.. 2013లో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ఆరెస్సెస్ వారు ఇంకా కోలుకోలేదని, అందుకే తనను ద్వేషిస్తున్నారంటూ నాటి వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీంతో స్పందించిన బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అక్బరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అక్బరుద్దీన్ వ్యాఖ్యల్లోని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోంశాఖను కోరినట్టు తెలుస్తోంది.

కేంద్ర హోంశాఖ కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అక్బర్‌పై ఇప్పటి వరకు నమోదైన కేసులు, చార్జిషీట్లు తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నట్టు సమాచారం. భైంసాలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ ఫోరెన్సిక్ నివేదిక ఏం చెప్పింది? గొంతు ఆయనదేనా? అన్న విషయాలను ఆరా తీస్తోంది. ఒకవేళ గొంతు అక్బరుద్దీన్‌దే అయితే ఎన్ఐఏకు ఎందుకు ఇవ్వలేదు? దర్యాప్తులో లోటుపాట్లు వంటి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. కాగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 29న అన్ని జిల్లాల్లోనూ సీఎం కేసీఆర్, అక్బరుద్దీన్ దిష్టబొమ్మలు దహనం చేస్తామని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు తెలిపారు. 

More Telugu News