Hyderabad: హయత్‌నగర్ యువతి కిడ్నాప్ కేసులో పోలీసుల పురోగతి.. నిందితుడి కుమారుడు, అల్లుడు అరెస్ట్

  • నిందితుడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా గుర్తింపు
  • అదుపులోకి తీసుకున్న వారిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ
  • నిందితుడి కోసం గాలిస్తున్న ఐదు బృందాలు

హైదరాబాద్ శివారు హయత్‌నగర్ బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఐతం రవిశేఖర్ కుమారుడు ఐతం రాజు, అతడి అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరినీ ఏపీ, తెలంగాణ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, కిడ్నాప్ అయి ఐదు రోజులు గడుస్తున్నా సోనీ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో సోనీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోనీని నిందితుడు రవిశేఖర్ కర్నూలు వైపు తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.

కర్ణాటకలో కారును దొంగిలించిన రవిశేఖర్ దానిలోనే హైదరాబాద్ వచ్చి సోనీని కిడ్నాప్‌ చేశాడని పోలీసులు తెలిపారు. కారు నంబర్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోనూ మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

More Telugu News