ఆజం ఖాన్ క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

26-07-2019 Fri 19:38
  • ప్యానెల్ స్పీకర్ పై ఆజం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • వ్యాఖ్యలపై నిరసన.. ఈరోజు దద్దరిల్లిన లోక్ సభ
  • క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న మహిళా ఎంపీలు 
నిన్న లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆజంఖాన్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై లోక్ సభ ఈరోజు దద్దరిల్లింది. లోక్ సభ సమావేశం అనంతరం బీజేపీ నేతలు, విపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, గల్లా జయదేవ్, దనీశ్ అలీ, సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలతో కలసి స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఆజం ఖాన్ క్షమాపణలు చెప్పకపోతే స్పీకర్ చర్యలు తీసుకుంటారని అన్నారు.

కాగా, నిన్న లోక్ సభలో ట్రిపుల్ తలాక్ పై చర్చ సందర్భంగా, ‘అటూ ఇటూ చూసి కాకుండా’ తన వైపు చూస్తూ మాట్లాడాలని ఆజంఖాన్ ని ప్యానెల్ స్పీకర్ రమాదేవి ఆదేశించారు. ‘మీ కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని, అలా చేస్తే మీరే నన్ను తప్పుకోమని చెబుతారని’ ఆజంఖాన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.