Uttarakhand: ఆవులు ఆక్సిజన్ వదులుతాయ్.. వాటికి దగ్గరగా ఉంటే టీబీ కూడా తగ్గిపోతుంది!: ఉత్తరాఖండ్ సీఎం రావత్

  • గోవులకు మసాజ్ చేస్తే శ్వాస సమస్యలు దూరం
  • ఆవు మూత్రంలో ఎన్నో విశేష గుణాలు ఉన్నాయి
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆక్సిజన్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే ఏకైక జంతువు ఆవు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆవుకు మసాజ్ చేస్తే శ్వాస సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ప్రకటించారు. ఆవు పాలలో, మూత్రంలో ఎన్నో విశేష గుణాలు ఉన్నాయని ప్రశంసించారు. డెహ్రాడూన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రావత్ ఈ మేరకు మాట్లాడారు.

ఆవులకు సమీపంలో నివసిస్తే టీబీ (క్షయ వ్యాధి) తగ్గిపోతుందని సీఎం రావత్ సెలవిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో సీఎం కార్యాలయం స్పందిస్తూ.. ఉత్తరాఖండ్ లో చాలామంది ప్రజలు ఆవు ఆక్సిజన్ ను విడుస్తుందని నమ్ముతారనీ, దాన్నే సీఎం చెప్పారని స్పష్టం చేశారు. కొన్నిరోజుల ముందు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ మాట్లాడుతూ.. గరుడ్ గంగ నది నీరు తాగితే మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ల అవసరం వుండదని చెప్పడంతో నెటిజన్లు ఓ స్థాయిలో ట్రోలింగ్ చేశారు.

More Telugu News