నేటి సాయంత్రం 6.00 గంటలకు... సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్న యడ్యూరప్ప!

26-07-2019 Fri 10:21
  • ఈ ఉదయం గవర్నర్ ను కలిసిన యడ్యూరప్ప
  • యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేసే అవకాశం
  • ఏర్పాట్లు చేయాలని సూచించిన గవర్నర్ కార్యాలయం
నేటి సాయంత్రం 6 గంటలకు కర్ణాటక కొత్త సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కుదిరిందని బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గవర్నర్ ను కలిసి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చే మూడున్నరేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడం వెనుక బీజేపీ ప్రమేయముందని వస్తున్న విమర్శలు అర్థరహితమని వ్యాఖ్యానించారు. కాగా, నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇందుకు ఏర్పాట్లు చేయాలని గవర్నర్ కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. మరోవైపు బెంగళూరు ప్రాంతంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించడంతో పాటు, బందోబస్తును పటిష్ఠం చేశారు.