Telugudesam: ఇక తప్పుకోండి... టీడీపీ హయాంలో నియమితులైన నామినేటెడ్ పదవులలో వున్న వారికి ఏపీ సర్కార్ వార్నింగ్!

  • టీడీపీ హయాంలో వందలాది మందికి నామినేటెడ్ పదవులు
  • ప్రభుత్వం మారినా కొనసాగుతున్న పలువురు
  • వెంటనే తొలగించాలని ఆర్పీ సిసోడియా పేరిట ఉత్తర్వులు

గడచిన ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని శాఖల్లో నియమించిన సలహాదారులు, చైర్‌ పర్సన్లు, చైర్మన్లు, ఎక్స్ పర్ట్ లు, కన్సల్టెంట్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని, లేకుంటే వారిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరికలు అందాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాల్సిందేనని, వారంతట వారు వైదొలగకుంటే, వెంటనే తొలగించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా తాజాగా ఆదేశాలు జారీచేశారు. గౌరవంగా వారు పదవుల నుంచి తొలగకుంటే, వారిని తొలగిస్తూ సంబంధిత శాఖలు ఆదేశాలు జారీచేయాలని సిసోడియా తన ఉత్తర్వుల్లో ఆదేశించారు.

 గత ప్రభుత్వ హయాంలో నియమితులైన చాలా మంది తమ పదవుల్లోనే కొనసాగుతున్నారని తెలిసిందని, వారిని తక్షణం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సిసోడియా ఆదేశించారు. కాగా, ఆర్టీసీ చైర్మన్ గా చంద్రబాబు నియమించిన వర్ల రామయ్య ఇంకా తన పదవిలోనే కొనసాగుతున్నారు. ఆయనతో పాటు సీఆర్డీయే, అమరావతి అభివృద్ధి సంస్థ తదితరాల్లో కన్సల్టెంట్లు కొనసాగుతున్నారు. మునిసిపల్ పరిపాలనా శాఖ కింద వందల మంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు వారందరినీ తొలగించే చర్యలు ప్రారంభమయ్యాయి.

More Telugu News