Jai sri ram: ‘జై శ్రీరాం’ నినాదం వినడం ఇష్టం లేకపోతే వేరే గ్రహం మీదికి పో.. సీనియర్ దర్శకుడిపై బీజేపీ నేత ఆగ్రహం

  • దేశ ప్రజలు ఓట్లు వేసిందే ‘జై శ్రీరాం’ నినాదానికే 
  • దేశంలో అదెప్పుడూ మార్మోగుతూనే ఉంటుంది
  • వినడం ఇష్టం లేనివాళ్లు శ్రీహరికోటలో పేరు నమోదు చేయించుకోవాలి

మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్‌పై కేరళ బీజేపీ అధికార ప్రతినిధి బి.గోపాలకృష్ణన్ మండిపడ్డారు. ‘జై శ్రీరాం’ నినాదం వినడం ఇష్టం లేకుంటే చంద్రుడిపైకి వెళ్లిపోవాలని సూచించారు. దేశంలో పెరిగిపోతున్న మాబ్ లించింగ్ ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖుల్లో ఆదూర్ కూడా ఉన్నారు. ముస్లింలు, దళితులు, మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయని, అకారణంగా వారిని కొట్టి చంపుతున్నారని ఆ లేఖలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారపూరిత దాడులు పెరిగిపోతున్నాయని, దేశంలో అసహనం పెరుగుతోందని పేర్కొన్నారు. ‘జై శ్రీరాం’ అనేది యుద్ధ నినాదంలా తయారైందని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఈ నినాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రధానిని కోరారు.

ఆదూర్ లేఖపై కేరళ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది బి.గోపాలకృష్ణన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జైశ్రీరాం నినాదం దేశంలో ఎల్లప్పుడూ మార్మోగుతుంటుందని స్పష్టం చేశారు. ఇరుగు పొరుగు దేశాల్లోనూ ఈ నినాదం వినిపిస్తుందని, వినడం ఇష్టం లేనివాళ్లు శ్రీహరికోటలో పేరు నమోదు చేసుకుని చంద్రమండలంపైకో, మరో గ్రహంపైకో వెళ్లిపోవాలని సూచించారు. దేశ ప్రజలు ‘జై శ్రీరాం’ నినాదానికే ఓట్లు వేశారని అన్నారు. వారు ‘జై శ్రీరాం’ అని నినదిస్తూనే ఉంటారని, కావాలంటే ఆదూర్ ఇంటి ముుందు కూడా నినదిస్తారని గోపాలకృష్ణన్ అన్నారు.

More Telugu News