Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి పేమెంట్ ఆప్షన్!

  • యాప్ బీటా వర్షన్‌ను పరీక్షిస్తోన్న ఫేస్‌బుక్
  • నగదు బదిలీని మరింత సులభతరం చేయడమే లక్ష్యం
  • వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్న వాట్సాప్

వాట్సాప్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. డిజిటల్ పేమెంట్ రోజురోజుకూ చాలా సులభతరమవుతోంది. ఇప్పటి వరకూ భీమ్, గూగుల్ పే తదితర యాప్‌లు అందుబాటులో ఉండగా, త్వరలో వాట్సాప్ కూడా పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.

ఆర్‌బీఐ నుంచి అనుమతులు రావడమే తరువాయి, వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ముందుగా భారత్‌లోని పది లక్షల యూజర్లతో ఈ యాప్ బీటా వర్షన్‌ను ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. ఈ సందర్భంగా విల్ కాథ్‌కార్ట్ మాట్లాడుతూ, నగదు బదిలీని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా మరింత సులభతరం చేయడమే లక్ష్యమన్నారు. దీనికోసం దేశంలోని వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఒకసారి ఈ యాప్ అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. దాదాపు ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో ఈ ఫీచర్ ను వాట్సాప్ లో అందుబాటులోకి తెస్తామని విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.

More Telugu News