KCR: తన స్వగ్రామంపై కేసీఆర్ కురిపించిన వరాల జల్లుపై డీకే అరుణ ఫైర్

  • కేసీఆర్ ఒక్క చింతమడక ప్రజలకే సీఎం కాదు
  • అలా ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారో చెప్పాలి
  • చాలా మందికి రైతు బంధు నగదే అందలేదు

వేల కోట్ల నిధులను గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్, గతంలో తనను ఎంపీగా గెలిపించిన పాలమూరును మాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పర్యటించిన సందర్భంగా కురిపించిన వరాల జల్లుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఆయన ఒక్క చింతమడక ప్రజలకే సీఎం కాదని, అన్ని గ్రామాలనూ సమానంగా చూడాలంటూ హితవు పలికారు. గత సీఎంలు సొంత గ్రామాలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించిన కేసీఆర్, నేడు చింతమడకలా ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారో చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. చింతమడకలో ఒక్కో ఇంటికి రూ.10 లక్షల లబ్ది చేకూరుస్తానని కేసీఆర్ అనడం సరికాదన్నారు. నేటి వరకూ రాష్ట్రంలో చాలా మందికి రైతు బంధు నగదే అందలేదని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సైతం కేసీఆర్ విస్మరించారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News