Sultan Muhammad V: ట్రిపుల్ తలాక్ ద్వారా రష్యా మాజీ సుందరికి విడాకులు ఇచ్చిన మలేసియా మాజీ రాజు

  • రష్యా మాజీ సుందరిని పెళ్లాడిన సుల్తాన్
  • పెళ్లి వార్తలు బయటకు రావడంతో పదవీచ్యుతుడైన రాజు
  • విడాకుల వార్తలను ఖండించిన భార్య రిహానా

మలేసియా మాజీ రాజు సుల్తాన్ ముహమ్మద్-5 తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చారు. రష్యా మాజీ సుందరి రిహానా ఓక్సానా తొర్బతెంకోను ముహమ్మద్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వార్తలు బయటకు పొక్కడంతో ఆయన సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సింహాసనాన్ని అధిరోహించిన రెండేళ్లకే ఆయన పదవీచ్యుతుడయ్యారు. ఒక ముస్లిం దేశంలో ఈ విధంగా పదవీచ్యుతుడైన తొలి రాజు ఈయనే కావడం గమనార్హం.

ఈ సందర్బంగా ముహమ్మద్ తరపు లాయర్ మాట్లాడుతూ, షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ ద్వారా రిహానా ఓక్సానాకు సుల్తాన్ విడాకులు ఇచ్చారని తెలిపారు. ఈశాన్య మలేసియాలోని ఓ ఇస్లామిక్ కోర్టు సుల్తాన్ కు విడాకుల పత్రాన్ని అందజేసిందని చెప్పారు. మరోవైపు, రిహాన్ ఓక్సానా మాట్లాడుతూ, విడాకులు ఇచ్చారన్న వార్తలను ఖండించారు. తనకు నేరుగా ట్రిపుల్ తలాక్ చెప్పలేదని అన్నారు. తాను ఇప్పటికీ సుల్తాన్ భార్యనేనని చెప్పారు. దీనికి తోడు సుల్తాన్, మే నెలలో జన్మించిన తన కుమారుడితో కలసి ఉన్న ఫొటోలను ఆమె ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దీనిపై సుల్తాన్ తరపు లాయర్ మాట్లాడుతూ, ఆ చిన్నారికి తండ్రి సుల్తానే అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు.

More Telugu News