Imran Khan: మా దేశంలో 40 వేల మంది వరకు టెర్రరిస్టులు ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్

  • పాక్ గడ్డపై ఉగ్ర కార్యకలాపాలు ఉండకూడదనే నిర్ణయం తీసుకున్నాం
  • నేషనల్ యాక్షన్ ప్లాన్ పై అన్ని పార్టీలు సంతకాలు చేశాయి
  • ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలనే నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వం మాదే

పాకిస్థాన్ గడ్డపై 30 వేల నుంచి 40 వేల మంది వరకు టెర్రరిస్టులు ట్రైనింగ్ పొందారని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వీరిలో కొందరు ఆప్ఘనిస్థాన్, కశ్మీర్ లో పోరాడారని చెప్పారు. తమ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వాలకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న రాజకీయ సంకల్పం లేకపోయిందని విమర్శించారు.

2014లో పాకిస్థానీ తాలిబాన్లు ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 150 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేచే దిశగా తయారు చేసిన నేషనల్ యాక్షన్ ప్లాన్ పై అన్ని రాజకీయ పార్టీలు సంతకం చేశాయని... దీని తర్వాత, ఇకపై పాకిస్థాన్ గడ్డపై నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఉండకూడదనే నిర్ణయాన్ని తామందరం కలసి తీసుకున్నామని చెప్పారు.

ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపాలనే నిర్ణయాన్ని తీసుకున్న తొలి పాక్ ప్రభుత్వం తమదేనని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాకిస్థాన్ చరిత్రలో ఇలా జరుగుతుండటం ఇదే తొలిసారని చెప్పారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

More Telugu News