Karnataka: కర్ణాటకం... కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరికీ ఆ అవకాశం దక్కలేదు!

  • ఐదేళ్లు పూర్తికాలం పాలించింది ఆ ముగ్గురే
  • ముగ్గురూ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులే
  • పూర్తికాలం నిలవని జేడీఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు

దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పూర్తికాలం మనుగడ సాగించిన దాఖలాల్లేవు. జేడీఎస్‌-బీజేపీ సంకీర్ణమైనా, కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణమైనా ఇదే పరిస్థితి. కర్ణాటకలో తొలి ప్రభుత్వం 1956లో ఏర్పడగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌కు చెందిన వారే కాగా, పూర్తికాలం ఐదేళ్లు పాలించిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్‌ వారే కావడం విశేషం. ఎస్‌.నిజలింగప్ప (1962-68), డి.దేవరాజ్‌ ఆర్స్‌ (1972-77), సిద్ధరామయ్య (2013-18)లు ఈ ఘనత దక్కించుకున్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడినా పూర్తికాలం మనుగడ సాగించలేదు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి తొలిసారి పగ్గాలు చేపట్టినప్పుడు రెండేళ్ల కంటే తక్కువ సమయమే  పదవిలో ఉన్నారు.

బీజేపీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఆయన  ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు పదవిలో ఉన్నారు. తర్వాత బీజేపీకి అధికారం అప్పగించేందుకు నిరాకరించడంతో కమలనాధులు ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి 2018 మేలో రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. 14 నెలలకే ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొని నిన్న జరిగిన బలపరీక్షలో ఓటమిపాలైంది. బీఎస్ యడ్యూరప్ప 2007లో తొలిసారి బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. మే 2008లో ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో యడ్యూరప్ప రెండోసారి సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలతో 2011 జూలైలో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. మూడోసారి 2018 మే 17 నుంచి మే 23 వరకూ ఆరు రోజులు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు.

More Telugu News