AIIB: ఏపీ ఎఫెక్ట్... ఇలాగైతే ఇండియా నుంచే తప్పుకుంటామని హెచ్చరించిన ఏఐఐబీ

  • ప్రాజెక్టుల సమీక్షలు, పనుల నిలిపివేత సరికాదు
  • జరిమానా విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం
  • పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాలకు కూడా రుణాలు ఇవ్వబోము

అమరావతికి రూ. 1360 కోట్ల రుణాన్ని ఇవ్వడం లేదని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఏఐఐబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది. తాము ఇచ్చిన రుణంతో ఏపీలో చేపట్టిన ఇతర ప్రాజెక్టులపై లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల సమీక్షలు, పనుల నిలిపివేతపై అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చిస్తామని తెలిపింది. తాము ఇచ్చిన రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులను సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో... నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.

తమ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతే... సంస్థ ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని లేఖలో ఏఐఐబీ తెలిపింది. ప్రాజెక్టుల కోసం ఏపీలోని గత ప్రభుత్వం తమ వద్ద నుంచి రుణాలు తీసుకుందని... ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సమీక్షల పేరుతో పనులను ఆపివేస్తోందని... ఇది సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... ఏ రాష్ట్రానికీ రుణాలను ఇవ్వబోమని, ఇండియా నుంచే తప్పుకుంటామని హెచ్చరించింది. ఈ అంశంపై విదేశాంగశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. అనంతరం, ఏఐఐబీ లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి విదేశాంగశాఖ జాయింట్ డైరెక్టర్ సేలియన్ పంపారు.

మరోవైపు, తమ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలోనే బ్యాంకర్ల సమావేశాన్ని ఏఐఐబీ నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించబోతున్నట్టు సమాచారం.

More Telugu News