Andhra Pradesh: పుష్కరాల షూటింగ్ కోసం బోయపాటిని చంద్రబాబు పిలిచాడా? అతనే వచ్చాడా?: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్

  • పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు పెట్టింది
  • 29 మంది మరణంపై సభాసంఘం నియమించాలి
  • అసెంబ్లీలో వైసీపీ సభ్యుడు జోగి రమేశ్ డిమాండ్

గతంలో జరిగిన పవిత్రమైన కృష్ణా, గోదావరి పుష్కరాలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, ఇందుకోసం సుమారు రూ.3,000 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెట్టిందని, అయితే, నాటి గోదావరి పురష్కరాలు ఓ దుర్ఘటనగా మిగిలాయని ఏపీ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

‘కుంభమేళాలా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నాం. భక్తులంతా భారీగా తరలివచ్చి పుష్కరాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ప్రచారం నిర్వహించింది. దీనికి ఓ ముహూర్తం కూడా పెట్టారు అధ్యక్షా. 2015, ఉదయం 6.26కు పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో భక్తులందరూ వచ్చి పుణ్య స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని చెప్పారు. కానీ ఆరోజున సుమారు 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పుణ్య స్నానం కోసం వచ్చిన ఈ భక్తుల మరణానికి కారణం ఆనాటి టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడే. సీఎం చంద్రబాబు పుణ్యస్నానం ఆచరించడం కోసం ఆ ముహూర్తాన్ని పెట్టుకున్నారు.

మంత్రులు, నేతలు ఎవరైనా వీవీఐపీ ఘాట్ లో పుణ్యస్నానం చేస్తారు. కానీ చిన్న ఘాట్ లో పుణ్యస్నానం చేస్తూ, సామాన్యులను వేరే ఘాట్ కు తరలించలేదు. చంద్రబాబు పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేస్తాడు. ఓ సినిమా డైరెక్టర్ బోయపాటి శీనును పిలిపించి దాన్ని షూటింగ్ తీయించారు. నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్షా. నారా చంద్రబాబు నాయుడు గారు బోయపాటిని సినిమా షూటింగ్ తీయమన్నాడా? లేక బోయపాటి శీనునే చంద్రబాబు దగ్గరకొచ్చి పుణ్య స్నానం చేస్తుంటే ఒక బాహుబలి సినిమా తీసి విడుదల చేయాలని భావించాడా?

ఆనాటి కేబినెట్ మంత్రులు బోయపాటిని తీసుకొచ్చి చేయించారా? అసలు 29 మంది భక్తుల మరణానికి కారణం ఎవరు? సినిమా షూటింగ్ ఎందుకు తీశారు? ఆ భక్తులందరినీ ఎందుకు ఆపారు? ఆరోజున వేసిన సోమయాజుల కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ తప్పు ఉందని చెప్పింది. కానీ ఓ వ్యక్తిని సస్పెండ్ చేసిన, చర్యలు తీసుకున్న పాపాన పోలేదు’ అని విమర్శలు గుప్పించారు.

ఈ ఘటనపై సభాసంఘాన్ని నియమించి 29 మంది మరణానికి కారకులైన దోషులను శిక్షించాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కోరారు. పుష్కర పనులను చాలావరకూ నామినేషన్లపై కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వేసిన ఏ రాయి కూడా కనిపించడం లేదనీ, మొత్తం కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు.

More Telugu News