Imran Khan: మా దేశంలో 40 ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయి.. ఇంతకాలం నిజాలను దాచారు: ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు కృషి చేస్తున్నా
  • అయితే ఇది అనుకున్నంత సులభమైన విషయం కాదు
  • అమెరికా-పాక్ ల మధ్య పరస్పర నమ్మకం లేకపోవడం బాధాకరం

పాకిస్థాన్ లో ఉగ్ర సంస్థలు  వేళ్లూనుకుని ఉన్నాయనే నిజాన్ని ఎట్టకేలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బయటపెట్టారు. పాక్ గడ్డపై నుంచి 40 ఉగ్ర సంస్థలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ చేదు నిజాన్ని గత 15 ఏళ్లుగా అమెరికాకు పాకిస్థాన్ చెప్పలేదని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికాతో కలసి తాము పని చేస్తున్నామని తెలిపారు.

ఇక అమెరికాలోని ట్విన్ టవర్లను (9/11 అటాక్) ఉగ్రవాదులు కూల్చిన ఘటనతో పాకిస్థాన్ కు సంబంధం లేదని... ఎందుకంటే ఆ దాడికి పాల్పడిన ఆల్ ఖైదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉందని చెప్పారు. పాకిస్థాన్ లో తాలిబాన్లు లేకపోయినప్పటికీ... అమెరికా చేస్తున్న యుద్ధంలో తాము కూడా చేతులు కలిపామని తెలిపారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ లో 40 ఉగ్ర సంస్థలు పని చేస్తున్నాయని... దీనిపై తనలాంటి ఎందరో పాకిస్థానీలు తీవ్ర ఆందోళన చెందామని... మనం బతకగలమా? అని భయపడ్డామని ఇమ్రాన్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి కలసి రావాలని గతంలో అమెరికా అడిగిందని... కానీ, అప్పుడు పాకిస్థాన్ సొంత మనుగడ కోసం పోరాడుతోందని తెలిపారు.

అమెరికాతో పాకిస్థాన్ అనుబంధం పరస్పర నమ్మకాల ఆధారంగా ఉండాలని ట్రంప్ కు తాను చెప్పానని ఇమ్రాన్ అన్నారు. శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ ఏం చేయబోతుందో ట్రంప్ కు వివరించానని తెలిపారు. తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు కృషి చేస్తున్నానని... ఇప్పటి వరకైతే తాము కొంత సాధించామని... అయితే, ఇది అనుకున్నంత సులభం కాదనే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేశానని చెప్పారు. ఎందుకంటే ఆప్ఘనిస్థాన్ లో ఇది అత్యంత క్లిష్టమైన పని అని తెలిపారు. శాంతిని నెలకొల్పే విషయంలో యావత్ దేశం, పాక్ ఆర్మీ తన వెనుక ఉన్నాయని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పాలనే అమెరికా ఆకాంక్షే తమ ఆకాంక్ష కూడా అని తెలిపారు.

అమెరికా-పాకిస్థాన్ ల మధ్య పూర్తి నమ్మకం లేకపోవడం తనను బాధిస్తోందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచైనా ఇరు దేశాల మధ్య నమ్మకంతో కూడిన బంధం ఏర్పడుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.

More Telugu News