చాలా టెన్షన్ పడుతున్నా: రష్మిక

23-07-2019 Tue 19:19
  • చాలా బిజీగా, ఒత్తిడిగా అనిపిస్తోంది
  • తీరిక లేకుండా పనిచేయడం ఓ వరం
  • నేను కూడా అలాగే ఉండాలని ఆశించా

అతి తక్కువ సమయంలోనే కథానాయిక  రష్మిక, స్టార్ హీరోలందరి సరసన అవకాశాలు దక్కించుకుని క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించాడు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ‘డియర్ కామ్రేడ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వరుస సినిమాలతో చాలా బిజీగా, ఒత్తిడిగా అనిపిస్తోందని తెలిపింది. ఒక్కోసారి తెల్లవారుజామున సెట్‌కు వెళ్తే తిరిగి పడుకునే సరికి తెల్లారిపోయేదని, మరుసటి రోజు మళ్లీ సెట్‌కి వెళ్లాల్సి వచ్చేదని, దీంతో తిండి, నిద్ర కూడా కరువయ్యేవని తెలిపింది. అయితే ఇలా తీరిక లేకుండా పని చేయడమన్నది ఓ వరమని, తాను కూడా అలాగే ఉండాలని ఆశించినట్టు రష్మిక తెలిపింది. అయితే సినిమాలో తన నటన ప్రేక్షకులకు నచ్చుతుందా? తన కష్టం ఫలిస్తుందా, లేదా? అని సినిమా విడుదలకు ముందు చాలా ఆందోళన పడుతున్నానని రష్మిక తెలిపింది.