Telugudesam: బీసీ నాయకుడిని సస్పెండ్ చేశారు..ఇక బీసీ బిల్లు పెట్టి ఏం న్యాయం చేస్తారు?: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

  • 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని జగన్ ప్రచారం చేశారు
  • ఈ విషయమై మా సభ్యులు ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?
  • పెన్షన్ల విషయంలో జగన్ మాట తప్పారు

ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు ముగ్గురిని సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ఈ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించే అవకాశం ఇవ్వలేదని, అందుకే, దీన్ని మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పుకుంటూ నాడు జగన్ రాష్ట్ర మంతా తిరిగారని, ‘మాట తప్పం, మడమ తిప్పం’ అని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఆ విషయాన్నే శాసనసభలో తమ సభ్యులు అడిగితే సస్పెండ్ చేస్తారా? సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడుని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక బీసీ నాయకుడిని సస్పెండ్ చేశారని, ఇక బీసీ బిల్లు పెట్టి బీసీలకు ఏం న్యాయం చేస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పెన్షన్ల విషయంలో జగన్ మాట తప్పారని విమర్శించారు. సభలో జగన్ శాసిస్తే, స్పీకర్ తు.చ. తప్పక పాటిస్తారని, పులివెందుల పంచాయితీలా అసెంబ్లీని చేయాలని జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. 

More Telugu News