Virat Kohli: టెస్టుల్లో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ

  • టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ
  • టెస్టుల్లో టీమిండియాకు నంబర్ వన్ ర్యాంకు
  • బౌలింగ్ విభాగంలో టాప్-10లో నిలిచిన జడేజా, అశ్విన్

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ లో తానే రారాజునని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. చివరిగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన కోహ్లీ ఖాతాలో 922 పాయింట్లున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (913) ఉన్నాడు. మూడో స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మూలస్తంభం ఛటేశ్వర్ పుజారా (881) నిలిచాడు.

బౌలర్ల విభాగంలో టాప్-10లో టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్థానం దక్కించుకున్నారు. జడేజాకు 6వ ర్యాంకు దక్కగా, అశ్విన్ 10వ స్థానంలో నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అగ్రస్థానంలో ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు టెస్టుల్లో 16వ ర్యాంకు దక్కింది. బౌలర్ల విభాగంలో ఆసీస్ స్పీడ్ స్టర్ ప్యాట్ కమిన్స్ టాప్ లో నిలవగా, ఆ తర్వాత వరుసగా జిమ్మీ ఆండర్సన్, కగిసో రబాడా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు.

ఆల్ రౌండర్ల విభాగంలో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్టర్ నంబర్ వన్ గా నిలిచాడు. జడేజా మూడోస్థానం చేజిక్కించుకున్నాడు. ఇక టెస్టుల్లో టీమ్ ర్యాంకింగ్స్ లోనూ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అగ్రస్థానం కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ (2), దక్షిణాఫ్రికా (3), ఇంగ్లాండ్ (4), ఆస్ట్రేలియా (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News