Biryani: బిర్యానీలో బల్లి పడిందంటూ డబ్బులు గుంజబోయి అడ్డంగా బుక్కయ్యాడు!

  • ముంబయి వాసి అతి తెలివి
  • బిర్యానీలో బల్లి ఉందంటూ క్యాంటీన్ యజమానిని బెదిరించిన వైనం
  • మోసగాడి గుట్టురట్టు చేసిన రైల్వే అధికారులు

ముంబయికి చెందిన సుందర్ పాల్ అనే వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించడం కోసం అతి తెలివి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. 65 ఏళ్ల సుందర్ పాల్ ముంబయి నుంచి కోయంబత్తూరు వెళుతూ గుంతకల్ జంక్షన్ లో దిగాడు. అక్కడి ప్లాట్ ఫాంపై ఉన్న క్యాటరింగ్ స్టాల్ వద్దకు వెళ్లి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత బిర్యానీలో బల్లి ఉందని, దాన్ని తినడంతో తనకు అస్వస్థత కలిగిందంటూ స్టాల్ యజమానికి చెప్పాడు. దాంతో ఆయన రైల్వే వైద్యబృందానికి సమాచారం అందించడంతో వారు వచ్చి సుందర్ పాల్ కు చికిత్స చేశారు.

అయితే, ఇక్కడే సుందర్ పాల్ తన ప్లాన్ అమలులో పెట్టాడు. ఈ విషయం పెద్దది చేస్తానని, స్టాల్ మూతపడుతుందని చెప్పడంతో ఆ క్యాంటీన్ యజమాని భయపడిపోయి సుందర్ పాల్ కు రూ.5 వేలు ఇచ్చాడు. కాగా, ఈ విషయం గుంతకల్ అసిస్టెంట్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వరకు వెళ్లడంతో ఆయన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాయంతో విచారణ చేసేందుకు వచ్చారు. బిర్యానీలో బల్లిపడిందని సుందర్ పాల్ చెప్పాడు.

మూడు రోజుల కిందట ఇలాగే జబల్ పూర్ రైల్వే స్టేషన్ లో కూడా ఓ వ్యక్తి సమోసాలో బల్లి ఉందంటూ రూ.50 వేలు వసూలు చేసినట్టు తెలియడంతో అతడి ఫొటోలు తెప్పించి చూడగా, అందులో ఉన్న వ్యక్తి, తమ ఎదురుగా ఉన్న సుందర్ పాల్ ఒక్కరే అని తెలిసింది. గట్టిగా నిలదీయడంతో సుందర్ పాల్ తన మోసాలను వెల్లడించాడు.

బిర్యానీలో తాను వేసింది బల్లి కాదని, అది బల్లిని పోలిన ఓ చేప అని చెప్పాడు. జబల్ పూర్ లో సగం చేపను ఉపయోగించి, ఆ మిగతా సగం చేపను గుంతకల్లులో బిర్యానీలో వేశానని వివరించాడు. సుందర్ పాల్ పై కఠినచర్యలు తీసుకునేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.

More Telugu News