Facebook: ఫేస్ బుక్ లో పరిచయమై ఒకరిని ఒకరు మోసం చేసుకున్న జంట!

  • అప్పటికే వివాహమైన యువకుడు, యువతి
  • భర్తకు దూరంగా ఉన్న యువతికి దగ్గరైన యువకుడు
  • పెళ్లయిన విషయం తనకు తెలియదంటూ పోలీసులకు ఫిర్యాదు
  • తనకు న్యాయం చేయాలంటున్న యువతి

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆపై వారిద్దరి కాపురంలో విభేదాలు ఏర్పడగా, ఇద్దరికీ అంతకుముందే పెళ్లయిందని, ఒకరిని ఒకరు మోసం చేసుకున్నారన్న విషయం బయటపడింది. తనను మోసం చేసిందని యువకుడు, తనను మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించారు.

యువతి వెల్లడించిన వివరాల ప్రకారం, విజయవాడలో బ్యూటీషియన్ గా పనిచేసే ఆమెకు, నాలుగేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వీరయ్య అలియాస్ వినయ్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్యా స్నేహం పెరిగిన తరువాత పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. తనకు అప్పటికే పెళ్లయిందని, భర్తకు దూరంగా ఉన్నానని ఆమె చెప్పగా, అండగా ఉంటానని నమ్మబలికాడు. పెళ్లి తరువాత ఇంట్లో చెప్పి ఒప్పిస్తానన్నాడు. అతన్ని నమ్మిన ఆమెను, తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని వచ్చిన వీరయ్య, విజయవాడలో కాపురం పెట్టాడు.

ఆపై కొన్ని రోజుల తరువాత, వీరయ్య తండ్రి ఆమెకు ఫోన్ చేసి, తన కుమారుడికి వివాహమై, ఎదుగుతున్న పిల్లలున్నారని, తన కొడుకును వదిలి పెట్టాలని బెదిరించాడు. ఆపై వీరయ్య సైతం అమెను వదిలి వెళ్లడంతో, తల్లిని, ఫ్రెండ్స్ ను తీసుకుని బాధితురాలు వీరయ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతని కుటుంబీకులు దాడి చేశారని, తాను పలుమార్లుగా రూ. 3.5 లక్షలను వీరయ్యకు ఇచ్చానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఇదిలావుండగా, తనకు ముందే వివాహమైన విషయాన్ని ఆమె దాచిపెట్టి తనను మోసం చేసిందని, పోలీసు కేసు పెట్టకుండా ఉండాలంటే రూ. 15 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోందని వీరయ్య పోలీసులను ఆశ్రయించాడు. తాను అందుకు అంగీకరించనందునే తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని, విచారించి తనకు న్యాయం చేయాలని వీరయ్య కోరుతున్నాడు. రెండు కేసులపైనా విచారిస్తామని గుంటూరు పోలీసు అధికారులు తెలిపారు. 

More Telugu News