Akhilesh Yadav: బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీని కోల్పోనున్న అఖిలేశ్ యాదవ్

  • 2012 నుంచి జడ్ ప్లస్ సెక్యూరిటీలో అఖిలేశ్
  • ములాయం సింగ్ కు సెక్యూరిటీ కొనసాగింపు
  • ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో డీలాపడ్డ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయనకు ఇప్పటి వరకు ఉన్న జెడ్ ప్లస్ బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీని తొలగించాలని నిర్ణయించింది. కేంద్ర సాయుధ బలగాల సెక్యూరిటీ కవర్ కింద వీఐపీలకు అందిస్తున్న సెక్యూరిటీపై కేంద్ర హోంశాఖ సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, ఉత్తరప్రదేశ్ నిఘా సంస్థలు అందించిన నివేదిక ఆధారంగా ఈ మేరకు నిర్ణయించింది. అయితే, అఖిలేశ్ కు కేంద్రం మరో కేటగిరీ సెక్యూరిటీని అందిస్తారా? లేదా పూర్తిగా సెక్యూరిటీని ఎత్తివేస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

మరోవైపు ములాయం సింగ్ యాదవ్ కు కల్పిస్తున్న బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీని మాత్రం కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అఖిలేశ్ యాదవ్ కు టాప్ కేటగిరీ సెక్యూరిటీని 2012 నుంచి కల్పిస్తున్నారు. మరో రెండు డజన్ల నేతలకు సెక్యూరిటీని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.

మన దేశంలో ప్రస్తుతం 13 మంది అగ్రస్థాయి రాజకీయ నాయకులకు టాప్ లెవెల్ సెక్యూరిటీని కేంద్రం కల్పిస్తోంది. వీరిలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి తదితరులు ఉన్నారు.

More Telugu News