Kashmir: భారత్ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. నష్టనివారణ చర్యలకు దిగిన అగ్రదేశం!

  • మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్
  • ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటూ భారత్ ఆగ్రహం
  • ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకుంటేనే చర్చలు సాధ్యపడతాయన్న అమెరికా

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని... ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవడంతో... అమెరికా ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.

కశ్మీర్ అంశం ఇండియా, పాకిస్థాన్ లకు చెందినదని... ఆ రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టెర్రరిజంపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకుంటేనే... భారత్ తో చర్చలు సాధ్యపడతాయని వెల్లడించింది. భారత్-పాక్ లు కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చేసే యత్నాలకు ట్రంప్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటేనే... భారత్ తో ద్వైపాక్షిక చర్చలు విజయవంతమవుతాయని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ చిత్తశుద్ధిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో తమ సహకారం ఉంటుందని తెలిపారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

More Telugu News