Gold: రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

  • 10 గ్రాముల బంగారం రూ.35,970
  • ఇప్పటివరకు ఇదే అధికం అంటున్న మార్కెట్ వర్గాలు
  • వెండి కిలో రూ.41,960

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.35,970 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నాటి కొనుగోళ్లలో బంగారం ధరలో రూ.100 పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని పసిడి విపణి వర్గాలు చెబుతున్నాయి.

స్థానిక జ్యుయెలర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో పాటు, ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా బంగారం ధర పెరగడానికి కారణమని అంచనా వేస్తున్నారు. ఇక, వెండి కిలో రూ.41,960 పలుకుతోంది. గతవారంతో పోలిస్తే వెండి ధరలో రూ.260 పెంపు నమోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండడంతో వెండి ధర పెరిగినట్టు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

More Telugu News