Sadhvi Pragya: బీజేపీ ఎంపీ సాధ్వి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్

  • దుమారాన్ని రేపుతున్న సాధ్వి వ్యాఖ్యలు
  • సాధ్విని వివరణ కోరిన బీఎల్ సంతోష్
  • సాధ్విని మందలించిన జేపీ నడ్డా

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో నిన్న బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్నే రేపాయి. తాను మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు ఎన్నిక కాలేదంటూ సాధ్వి చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛభారత్’ మిషన్‌కు విశేష ప్రాచుర్యం కల్పిస్తుంటే సాధ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ అధిష్ఠానం నుంచి సాధ్వికి ఆదేశాలు వెళ్లాయి.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆమెను మందలించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్‌ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌ సాధ్విని వివరణ కోరినట్టు సమాచారం. గతంలో కూడా సాధ్వి మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి ఒకసారి, తన శాపం వల్లే ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ముంబై ఉగ్రదాడిలో మరణించారని వ్యాఖ్యానించి వివాదాస్పదమయ్యారు. అప్పుడు కూడా ఆమెపై అధిష్ఠానం కన్నెర్ర జేయడంతో ఆమె క్షమాపణ చెప్పారు.

More Telugu News