MS Dhoni: సెలెక్టర్లకు మరింత క్లారిటీ ఇచ్చిన ధోనీ!

  • ఇప్పట్లో రిటైర్ కానని చెప్పిన ధోనీ
  • భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా లేనని స్పష్టం చేసిన వైనం
  • కుర్రాళ్లను ప్రోత్సహించాలని సెలెక్టర్ల నిర్ణయం

టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కెరీర్ చరమాంకంలో ఉన్నాడన్నది క్రికెట్ పండితుల మాట. వరల్డ్ కప్ ముగిసిన అనంతరం ధోనీ రిటైర్మెంటు ప్రకటించకపోగా, పారాచూట్ రెజిమెంట్ లో పనిచేసేందుకు రెండు నెలల ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, వెస్టిండీస్ టూర్ కు ధోనీని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ధోనీతో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, సమర్థుడైన వికెట్ కీపర్ ను ఇప్పటినుంచే తయారుచేసుకునేందుకు వీలుగా ధోనీతో ఎమ్మెస్కే చర్చలు జరపగా, తానిప్పుడు రిటైర్ కావడంలేదని, అదే సమయంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో కూడా భాగం కాదలచుకోలేదని ధోనీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక తనను మేజర్ టోర్నమెంట్లకు పరిగణనలోకి తీసుకోనవసరంలేదని ధోనీనే పరోక్షంగా చెప్పడంతో కుర్రాళ్లను ఎంకరేజ్ చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే రిషబ్ పంత్ ను మూడు ఫార్మాట్లలో ప్రధాన వికెట్ కీపర్ గా విండీస్ పర్యటనకు ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.

More Telugu News