Sheila Dixit: ప్రకృతికి హాని జరగని రీతిలో షీలా దీక్షిత్ భౌతికకాయం దహనం

  • సీఎన్జీ విధానంలో షీలా దీక్షిత్ దహనసంస్కారాలు
  • ఖర్చు రూ.500 మాత్రమే!
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వేదపండితులు

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో జరిగాయి. అయితే, షీలా దీక్షిత్ ప్రకృతి ప్రేమికురాలు. తన అంత్యక్రియలను ప్రకృతికి హాని తలపెట్టని రీతిలో నిర్వహించాలని ముందే కోరుకున్నారు. అందుకే ఆమె చనిపోయాక భౌతికకాయాన్ని సీఎన్జీ వినియోగించి దహనం చేశారు. సీఎన్జీ అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. గ్యాస్ ఆధారిత దహన ప్రక్రియ కావడంతో కాలుష్యం అన్నమాటే తలెత్తదు. పైగా ఖర్చు, సమయం కూడా చాలా తక్కువ.

సాధారణంగా కట్టెలు ఉపయోగించి నిర్వహించే దహనానికి రూ.1000 ఖర్చవుతుండగా, గ్యాస్ తో దహనం ఖర్చు రూ.500 మాత్రమే. పైగా కట్టెలతో శరీరం పూర్తిగా కాలిపోవాలంటే సుమారు 12 గంటల వరకు పడుతుంది. అదే, గ్యాస్ తో గంటలోపే దేహం కాలిపోతుంది. అయితే, ఇక్కడ కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. షీలా దీక్షిత్ హిందువు కావడంతో, ఓ హిందువు అంత్యక్రియలు జరపాల్సిన పద్ధతి ఇది కాదని కొందరు వేదపండితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎన్జీ విధానంలో దహనసంస్కారాలు హిందూ సంప్రదాయం కాదని స్పష్టం చేశారు.

More Telugu News