KS Bharat: సాహా పునరాగమనంతో అవకాశం కోల్పోయిన ఆంధ్రా వికెట్ కీపర్

  • సెలెక్షన్ కమిటీ దృష్టిలో కేఎస్ భరత్
  • ఫిట్ నెస్ సాధించి మళ్లీ జట్టులోకి వచ్చిన సాహా
  • భవిష్యత్ లో కేఎస్ భరత్ ను కూడా పరీక్షిస్తామని చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్

రంజీ ట్రోఫీలో విశేష ప్రతిభ కనబర్చిన ఆంధ్రా జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ పేరు కూడా టీమిండియా సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆదివారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు.

దీనిపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, గాయపడ్డ ఆటగాడికి నిరూపించుకునే అవకాశం ఇవ్వడం సబబు అని, అందుకే సాహాను మళ్లీ తీసుకున్నామని వివరించారు. ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ గురించి బాగా చర్చ జరిగిందని తెలిపారు. భరత్ తాజా ఫామ్ అందరినీ ఆకట్టుకుందని, కానీ సాహాకు మరో చాన్స్ ఇవ్వాలని భావించామని పేర్కొన్నారు. భరత్ ఇటీవల ఇండియా-ఎ టీమ్ తరఫున ఆడుతూ 3 సెంచరీలు నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. కాగా, భవిష్యత్ లో సాహాతో పాటు, పంత్, భరత్ లను కూడా పరీక్షిస్తామని ఎమ్మెస్కే వెల్లడించారు.

More Telugu News