Gorantla Butchaiah Chowdary: కోస్తా జిల్లాల్లో స్థలాలే లేవు.. లక్షల ఇళ్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?: గోరంట్ల

  • రాష్ట్రంలో అవినీతి వారసుల ప్రభుత్వం నడుస్తోంది
  • వైయస్ హయాంలో నిర్మించిన 14 లక్షల ఇళ్లు ఎక్కడ?
  • వాకౌట్ చేద్దామన్నా, నిరసన వ్యక్తం చేద్దామన్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు

ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో హౌసింగ్ లో రూ. 4వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. వైయస్ హయాంలో నిర్మించిన 14 లక్షల ఇళ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో 7 లక్షల ఇళ్లను నిర్మించామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెబుతోందని... బడ్జెట్ లో కేటాయించిన నిధులను చూస్తే 25 లక్షల ఇళ్ల నిర్మాణం సాధ్యమేనా? అని గోరంట్ల ప్రశ్నించారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణలో కూడా  25 లక్షల ఇళ్లను కట్టలేదని చెప్పారు. కోస్తా జిల్లాల్లో స్థలమే లేదని... అలాంటప్పుడు లక్షల ఇళ్లను ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పేదలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు మైక్ ఇవ్వడం లేదని... వాకౌట్ చేద్దామన్నా, నిరసన వ్యక్తం చేద్దామన్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని చెప్పారు.

More Telugu News