Jammu And Kashmir: ఉగ్రవాదులు వారిని చంపాలి... నోరుజారి నాలిక్కరుచుకున్న జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌

  • అమాయక ప్రజల్ని చంపితే ఏమొస్తుందంటూ వ్యాఖ్య
  • రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారిని చంపాలంటూ పిలుపు
  • విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ

ఆవేశమో, అనాలోచితంగానో జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌ నోరుజారి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. ఉగ్రవాదులు చంపాల్సింది అమాయక ప్రజల్ని కాదని, ఏళ్ల తరబడి నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులనని బహిరంగంగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే....కార్గిల్‌లోని ఖ్రీ సుల్తాన్ ఛూ స్టేడియంలో లడక్ టూరిజం ఫెస్టివల్-2019ను గవర్నర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యపాలిక్‌ తుపాకులతో రాజ్యం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులు తోటి ప్రజల్ని చంపుతున్నారని, వీరు చంపాల్సింది కశ్మీర్‌ను దోచుకుంటున్న వారినని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్‌సీపీ నేత ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ గవర్నర్‌ మాటలు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ఇకపై ఏ రాజకీయ నాయకుడుగాని, అధికారిగాని చనిపోతే అది గవర్నర్‌ ఆదేశాల మేరకు జరిగిందని భావించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ జి.ఎ.మిర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అటవిక రాజ్యాన్ని పోషిస్తున్నారా? అని ప్రశ్నించారు.

తన వ్యాఖ్యలు వివాదం కావడం గ్రహించిన గవర్నర్ తన మాటలను తప్పుగా అర్ధం చేసుకోరాదని ఈరోజు మీడియా ముందు వివరణ ఇచ్చారు. కశ్మీర్‌లో పెచ్చరిల్లుతున్న అవినీతిని చూసి తట్టుకోలేక భావోద్వేగంతో గవర్నర్ గా కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేశానని తెలిపారు.

More Telugu News