ఈ ఉదయం హాయిగా యోగా చేస్తూ గడిపిన కన్నడ బీజేపీ ఎమ్మెల్యేలు!

22-07-2019 Mon 10:24
  • బెంగళూరులోని రమదా హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్ వలలో పడకుండా కాపలా కాస్తున్న బీజేపీ
  • నేడు సుప్రీంకోర్టులో కర్ణాటకపై కీలక విచారణ
కర్ణాటకలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న వేళ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం సేదదీరారు. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్ లో మకాం వేసిన వీరు, నేటి కుమారస్వామి విశ్వాస పరీక్ష నిమిత్తం అసెంబ్లీకి వెళ్లే ముందు, హోటల్ లాన్ లో యోగా చేస్తూ మనసును తేలిక పరచుకునే ప్రయత్నం చేశారు. బెంగళూరులోని రమదా హోటల్ లో ఉన్న వీరు, ఓ యోగా గురువు సూచనల మేరకు యోగా చేస్తూ కనిపించారు. కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలపై వల విసిరే ప్రమాదం ఉన్నందున, అందరు ఎమ్మెల్యేలనూ బీజేపీ హోటల్ లో ఉంచి కాపలా కాస్తోంది.

ఇదిలావుండగా, కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. వీరంతా ముంబైలో ఉండటం, కుమారస్వామి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరడంతో నేడు కూడా విశ్వాస పరీక్ష జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు కుమారస్వామితో పాటు రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ సాగనుంది. సుప్రీంలో జరుగుతున్న విచారణను సాకుగా చూపి స్పీకర్ విశ్వాస పరీక్షను వాయిదా వేయవచ్చని సమాచారం.