Nizamabad District: మీసేవ ఆపరేటర్ ను బోల్తా కొట్టించి... రూ.89 వేలతో ఉడాయించిన యువకుడు!

  • మొదట అసలైన దిర్హామ్ లు చూపించి ఆపరేటర్ ను నమ్మించిన యువకుడు
  • రెండో పర్యాయం కలర్ జిరాక్స్ లతో మోసం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

నిజామాబాద్ జిల్లా నవీపేటలో సినీ ఫక్కీలో మోసం జరిగింది. మీ సేవ కేంద్రం ఆపరేటర్ ను ఎంతో తెలివిగా బోల్తా కొట్టించి రూ.89 వేలతో ఉడాయించిన వైనం కలకలం రేపింది. నవీపేటలో ఉన్న మీ సేవ కేంద్రానికి వచ్చిన ఓ యువకుడు యూఏఈ కరెన్సీ దిర్హామ్స్ ను భారత కరెన్సీలోకి మార్చుకోవాలని అక్కడి ఆపరేటర్ ను కోరాడు. 4800 దిర్హామ్స్ ఉన్నాయని చెప్పాడు. ఆమె వాటిని పరీక్షించి అసలైన నోట్లుగా గుర్తించింది. అయితే, వాటికి భారత కరెన్సీలో రూ.88,800 మాత్రమే వస్తుందని చెప్పడంతో ఆ యువకుడు కాసేపు వాదించాడు. ఎక్కువ ఇవ్వాలని కోరగా, ఆపరేటర్ అంగీకరించలేదు.

దాంతో అక్కడినుంచి వెళ్లిపోయిన ఆ యువకుడు మళ్లీ వచ్చి మొదట చెప్పిన డబ్బుకు మరో రెండు వందలు కలిపి రూ.89 వేలు రౌండ్ ఫిగర్ ఇవ్వాలని కోరాడు. దాంతో ఆ ఆపరేటర్ సరేనని చెప్పి, అతడిచ్చిన పర్సులోని దిర్హామ్ లను ఈసారి పరిశీలించకుండానే తీసుకుంది. ఆ యువకుడికి రూ.89 వేలు ఇచ్చింది. కాగా, ఆ యువకుడితో వచ్చిన మరో యువకుడు మీసేవ కేంద్రం బయట బైక్ పై వేచి ఉన్నాడు. ఆ డబ్బు తీసుకుని అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. అయితే, ఆ పర్సులో ఉన్న డబ్బును పరీక్షగా చూసిన ఆపరేటర్ కు తాను మోసపోయిన విషయం అర్థమైంది. ఎందుకంటే ఆ పర్సులో ఉన్నది అసలైన దిర్హామ్ లు కాదు, వాటికి కలర్ జిరాక్స్ తీసి ఆమెను బోల్తా కొట్టించాడు.

మొదట అసలైన దిర్హామ్ లు చూపించి ఆమెను నమ్మించిన యువకుడు, రెండోసారి వచ్చినప్పుడు మాత్రం కలర్ జిరాక్స్ లతో టోపీ వేశాడు. వాటిని ఓసారి చూసి ఉండడంతో అసలైన దిర్హామ్ లేనని నమ్మిన ఆ యువతి రూ.89 వేలు అప్పనంగా అందించించింది. దీనిపై మీసేవ యజమానికి వివరించగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఇదే తరహాలో పలు మీసేవ కేంద్రాల్లోనూ మోసాలు జరిగినట్టు పలువురు బాధితులు వెల్లడిస్తున్నారు.

More Telugu News