Hanuma Vihari: టీమిండియా టెస్టు జట్టులో స్థానం నిలబెట్టుకున్న కాకినాడ కుర్రాడు

  • విండీస్ టూర్ కు ఎంపికైన హనుమ విహారి
  • ఇంగ్లాండ్, ఆసీస్ పర్యటనల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం
  • ఆఫ్ స్పిన్ తోనూ ప్రభావం చూపగల సత్తా విహారి సొంతం

తెలుగు క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడం చాలా అరుదైన విషయం. తాజాగా, కాకినాడ కుర్రాడు హనుమ విహారి టీమిండియా టెస్టు జట్టులో మరోసారి స్థానం దక్కించుకున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియాలో విహారి కూడా ఎంపికయ్యాడు.  ఈ సీజన్ లో భారత జట్టు చివరిగా టెస్టు సిరీస్ ఆడింది ఆస్ట్రేలియాతో. 2018-19లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో హనుమ విహారి కూడా పాల్గొన్నాడు. సిడ్నీ మ్యాచ్ లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు, ఇంగ్లాండ్ గడ్డపైనా టీమిండియా టెస్టు జట్టుతో పర్యటించాడు.

భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా సెలెక్టర్లు మరోసారి హనుమ విహారిపై నమ్మకం ఉంచారు. ఆఫ్ స్పిన్ కూడా ప్రభావవంతంగా వేయగల విహారి జట్టుకు సమతూకం తెస్తాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. కెరీర్ లో ఇప్పటివరకు విహారి 4 టెస్టులాడి 26 సగటుతో 132 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు. హనుమ విహారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ. క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో హైదరాబాద్ రంజీ టీమ్ లో ఆడాడు. ప్రస్తుతం ఆంధ్రా రంజీ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

More Telugu News