Andhra Pradesh: తెలుగుదేశం అవినీతి మొత్తాన్ని త్వరలోనే బయటకు తీస్తాం!: గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

  • టీడీపీ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తోంది
  • ఐదేళ్లలో ఏపీ అవినీతిమయంగా మారింది
  • రాయచోటిలో మీడియాతో ప్రభుత్వ ప్రధాన విప్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని వ్యాఖ్యానించారు. అవినీతిరహిత ఆంధ్రప్రదేశ్ కోసం ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో తమకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదనీ, కానీ తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ సభ్యులకు కావాల్సిన సమయం లభిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వ్యవస్థలను క్రమబద్ధీకరించే బాధ్యత సీఎం జగన్ పై పడిందన్నారు.  ‘క్రింది స్థాయి నుంచి రెవెన్యూ, పోలీస్, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టుల విషయంలో అవినీతి లేకుండా చేస్తాం. అవినీతి నిర్మూలన కోసం మీడియా సహకారం ఎంతో అవసరం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. ఎప్పుడు లేని విధంగా వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.

ప్రై‍వేటు పాఠశాలల దోపిడిని నివారించేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 20 బిల్లులు ప్రవేశపెట్టాం. ఇంటింటికి కుళాయి ఇవ్వడానికి కూడా రివర్స్ టెండరింగ్ వేస్తున్నాం. ఉగాదికి పండుగలోపు 25 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేస్తాం’ అని తెలిపారు.  రూ.130 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లును మంజూరు చేశామన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అంతా త్వరలోనే బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు.

More Telugu News