Tamil Nadu: చిన్నప్పుడే తల్లి దూరమయ్యింది...తండ్రి చనిపోయాక చేరువయ్యింది

  • పద్నాలుగేళ్ల తర్వాత మాతృమూర్తి కనిపించడంతో కుమార్తెల ఆనందం
  • భావోద్వేగానికి గురయిన తల్లి
  • భగవంతుడే ఆసరా కల్పించాడని ఆనందం

భర్తతో విభేదాల కారణంగా ఇద్దరి బిడ్డల్ని అతని వద్దే వదిలి వెళ్లిపోయిన తల్లి అనుకోకుండా 14 ఏళ్ల తర్వాత మళ్లీ బిడ్డల వద్దకు చేరడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. అది కూడా రెండు వారాల క్రితమే తండ్రి దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి అనుకోని ఆసరాలా తల్లి లభించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వివరాల్లోకి వెళితే...తమిళనాడు తిరునల్వేలి సురండై చేనేత కాలనీకి చెందిన భాగ్యరాజ్‌ (50),  జ్ఞానసెల్వి (45) దంపతులు. వీరికి జపరాణి, షకీలా ఇద్దరు కుమార్తెలు. జపరాణికి పదేళ్ల వయసు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు రావడంతో జ్ఞానసెల్వి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. భాగ్యరాజ్‌ మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలకోసం ఒంటరి జీవితానికే పరిమితమయ్యాడు.

తండ్రి మనసెరిగిన కుమార్తెలు కూడా కష్టపడి చదివి ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా, మరొకరు కోల్‌కతాలోని ఓ అతిథి గృహం ఉద్యోగినులుగా స్థిరపడ్డారు. కాగా, భాగ్యరాజ్‌ రెండు వారాల క్రితం చనిపోయాడు. తండ్రి అంతిమ సంస్కారం కోసం షకీలా వచ్చింది. రెండు రోజుల క్రితం సోదరి కోల్‌కతా బయలు దేరడంతో చెల్లిని డ్రాప్‌ చేసేందుకు రైల్వేస్టేషన్‌కి వెళ్లింది.

అక్కడ తల్లి కనిపించడంతో ఆశ్చర్యపోవడం అక్కాచెల్లెళ్ల వంతయింది. దగ్గరకు వెళ్లి తల్లిని పలకరించగా ఆమె ఆశ్చర్యంగా చూసింది. తామెవరిమో చెప్పడంతో ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యింది. ఆనందంతో పొంగిపోయి బిడ్డల్ని దగ్గరకు తీసుకుంది. చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు బాధపడుతున్నానంటూ భోరుమంది. కుమార్తెలు ఎంతో ఆనందంగా ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.

More Telugu News