Tirumala: కన్న బిడ్డను మరచిపోయి తిరుమలకు బస్సెక్కిన యూపీ జంట!

  • వెంకన్న దర్శనానికి యూపీ నుంచి వచ్చిన రామ్ సహాయ్
  • అలిపిరి చెక్ పాయింట్ వద్ద బాలుడిని మరచిపోయిన వైనం
  • గుర్తించి, క్షేమంగా అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది

తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన ఓ జంట, బస్సెక్కే హడావుడిలో తమ నాలుగేళ్ల బిడ్డను మరచిపోగా, పిల్లాడిని గమనించిన అధికారులు అతన్ని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన రామ్‌ సహాయ్‌, 13 మంది బంధుమిత్రులతో కలిసి, నిన్న ఉదయం తిరుపతికి వచ్చాడు. తిరుమలకు వెళ్లేందుకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీరంతా బస్సెక్కారు. అలిపిరి చెక్‌ పాయింట్‌ కు వద్దకు బస్ చేరుకోగా, తనిఖీలు పూర్తయిన అనంతరం వారంతా అదే బస్ ఎక్కారు.

ఈ హడావుడిలో తమ బిడ్డ ఆయుష్ ను వీరు అలిపిరి దగ్గరే వదిలేసివెళ్లారు. బస్సు కొంతదూరం వెళ్లిన తరువాత, బిడ్డ తమ పక్కన లేడన్న విషయాన్ని గమనించిన సహాయ్, బాలుడు అలిపిరి వద్దే ఉండి వుంటాడని భావించి, పరుగు పరుగున వెనక్కు వచ్చారు. అప్పటికే బాలుడు తప్పిపోయాడని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది, ఆయుష్ ను తమ సంరక్షణలో ఉంచుకున్నారు. రామ్ సహాయ్ వచ్చిన తరువాత, బాలుడిని ఆయనకు అప్పగించారు.

More Telugu News