Trai: ఎయిర్ టెల్ ఆధిపత్యానికి గండి కొట్టిన రిలయన్స్ జియో!

  • వినియోగదారులను పెంచుకుంటున్న జియో
  • తొలి స్థానంలో కొనసాగుతున్న వోడాఫోన్-ఐడియా
  • రెండో స్థానంలో జియో, మూడో స్థానంలో ఎయిర్ టెల్
  • వివరాలు వెల్లడించిన ట్రాయ్

భారత టెలికం రంగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ ను అధిగమించి మొత్తం 32.29 కోట్ల మంది వినియోగదారులతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఐడియా, వోడాఫోన్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ తొలి స్థానంలో 38.75 కోట్ల మంది వినియోగదారులతో వైర్ లెస్ సెగ్మెంట్ లో తొలి స్థానంలో ఉంది. అయితే, ఇదే సమయంలో వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 39.32 కోట్ల నుంచి 38.75 కోట్లకు తగ్గడం గమనార్హం. ఏప్రిల్ గణాంకాలను విడుదల చేసిన ట్రాయ్, వోడాఫోన్-ఐడియా వినియోగదారుల సంఖ్య 56 లక్షలకు పైగా తగ్గిందని తెలిపింది.

ఇక జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరుకు 31.48 కోట్లు ఉండగా, మేలో 32.29 కోట్లకు పెరిగింది. ఎయిర్ టెల్ వినియోగదారుల సంఖ్య 32.03 కోట్ల నుంచి 32.18 కోట్లకు పెరిగిందని ట్రాయ్ పేర్కొంది. జియో వినియోగదారుల సంఖ్య 81 లక్షలకు పైగా పెరగడంతో, ఆ సంస్థ రెండో స్థానానికి చేరింది. ఇండియాలో వైర్ లెస్ టెలీ డెన్సిటీ 88.31 నుంచి 88.42కు పెరిగిందని ట్రాయ్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ 56.42 నుంచి 56.94కు పెరిగిందని వెల్లడించింది.

ఇండియాలోని గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోందని తెలిపిన ట్రాయ్, నెట్ వర్క్ సైతం వేగంగా పెరుగుతోందని పేర్కొంది. కాగా, ఇండియాలో ప్రస్తుతం వినియోగదారుల సంఖ్య విషయంలో వోడాఫోన్-ఐడియా తొలి స్థానంలో, రిలయన్స్ జియో రెండో స్థానంలో, ఎయిర్ టెల్ మూడో స్థానంలో ఉన్నాయని వెల్లడించింది.

More Telugu News